Wednesday, September 29, 2010

అయోధ్యపై అలహాబాద్‌ హైకోర్టుకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌ 30న 3:30 కు తీర్పు

ముఖ్యాంశాలు
న్యూఢిల్లీ, లక్నో: అయోధ్యలో రామజన్మభూమి, బాబ్రీ మసీదు స్థల వివాదంపై అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ గురువారం (30వ తేదీన) మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు తీర్పును వెలువరించనున్నట్టు ప్రకటించింది. ఆరు దశాబ్దాలుగా రెండు వర్గాల ప్రజల మధ్య కొనసాగుతున్న వివాదానికి సంబంధించి అత్యంత కీలకమైన ఈ తీర్పు కోసం దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఎడతెగని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ తీర్పును వాయిదా వేయాలని కోరుతూ రిటైర్డ్‌ అధికారి రమేష్‌ చంద్ర త్రిపాఠీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 23వ తేదీన ఇచ్చిన స్టేని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌హెచ్‌ కపాడియా నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు తొలగించింది.అయితే,ఆ రోజు పిటిషనర్‌కి హైకోర్టు విధించిన జరిమానాను రద్దు చేయలేదు. స్టే తొలగించడంతో అలహాబాద్‌ హైకోర్టు అయోధ్యపై తీర్పు వెలువరించేందుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ బెంచ్‌లో జస్టిస్‌ అఫ్తాబ్‌ ఆలం, జస్టిస్‌ కెఎస్‌ రాథాకృష్ణన్‌లు సభ్యులుగా ఉన్నారు. అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ ఈనెల 24వ తేదీన అయోధ్యపై తీర్పును వెలువరించవలసి ఉండగా,23వ తేదీన సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్టేను సుప్రీంకోర్టు తొలగించింది.
ఈ తీర్పు వాయిదా కోసం దాఖలైన పిటిషన్‌ మీద వాదోపవాదాల సందర్భంగా అటార్నీ జనరల్‌ జిఇ వహనవతి ఈ వివాదం సాధ్యమైనంత త్వరలో పరిష్కారం కావాలని కేంద్రం కోరుకుంటున్నదని చెప్పారు. తీర్పు వెలువడే వరకూ ఉత్కంఠ కొనసాగడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ సమస్యగా పరిణమిస్తుందనీ, అందువల్ల ఈ కేసు తీర్పు త్వరగా వెలవడాలన్నదే కేంద్రం అభిమతమని ఆయన చెప్పారు. ఈ వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోవడానికి 3 నెలల పాటు ఈ కేసు తీర్పును అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వాయిదా వేసేట్టు ఆదేశించాలంటూ పిటిషన్‌ చేసిన విజ్ఞప్తితో వహనావతి అంగీకరించలేదు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రొహతగి వాదిస్తూ, హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే శాంతిభద్రతల సమస్యలు తలెత్తగలవన్న భయాన్ని వ్యక్తం చేశారు. 1992 డిసెంబర్‌ 6వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం సంభవించిన పరిణామాలు పునరావృతం కాగలవన్న భయ సందేహాలను కూడా ఆయన వ్యక్తం చేశారు.
కాగా, ఇరువైపులా వాదనలను విన్న సుప్రీంకోర్టు బెంచ్‌ ఈ పిటిషన్‌ని తోసిపుచ్చుతున్నట్టు ప్రకటించింది.ఈ పిటిషన్‌ తోసిపుచ్చవలసిందేనన్నది తమ నిశ్చితాభిప్రాయమనీ, అందుకే తోసిపుచ్చుతున్నామని బెంచ్‌ పేర్కొంది. ఈనెల 23వ తేదీన జస్టిస్‌ రవీంద్రన్‌, హెచ్‌ఎల్‌ గోఖ్లేలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వాయిదాకు దాఖలైన పిటిషన్‌ని పురస్కరించుకుని తీర్పుపై స్టే ఇచ్చింది. అయితే, ఈ ఇద్దరు న్యాయమూర్తుల్లో జస్టిస్‌ రవీంద్రన్‌ ఆరోజే త్రిపాఠీ పిటిషన్‌ని తిరస్కరించాలని అన్నారు. ఇరువురు న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాల కారణంగా నేటికి వాయిదా వేశారు. నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని విస్తృత బెంచ్‌ ఈ పిటిషన్‌ని పరిశీలించి తిరస్కరించింది. కొంతమంది హిందూ నాయకుల తరఫున న్యాయశాస్త్ర కోవిదుడు సోలీ సోరాబ్జీ వాదిస్తూ అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వాయిదా వల్ల ఉత్కంఠ పెరిగిపోతోందనీ, అందువల్ల వెంటనే తీర్పు వెలువరించేందుకు అనుమతించాలని కోరారు. కాగా,కోర్టు వెలుపల పరిష్కారానికి గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయనీ, అవేమీ ఫలించలేదనీ, అందువల్ల కోర్టు తీర్పే శరణ్యమని చాలా మంది కక్షిదారులు సుప్రీంకోర్టుకు
తెలియజేశారు. అయోధ్య తీర్పునకు ఆటంకాలను సుప్రీంకోర్టు తొలగించడం పట్ల కాంగ్రెస్‌, బిజెపి, సమాజ్‌వాదీ పార్టీ లతో సహా పలు పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. కోర్టు తీర్పునకు అంతా కట్టుబడి ఉండాలని అన్ని వర్గాల ప్రజలకు విడివిడిగా విజ్ఞప్తి చేశాయి. అయోధ్య తీర్పు గురువారం వెలువడనున్న నేపధ్యంలో అయోధ్య, లక్నోలతో సహా ఉత్తరప్రదేశ్‌ నగరాలు,పట్టణాల్లోనే కాక,ముంబై,ఢిల్లీ,హైదరాబాద్‌,అహ్మదాబాద్‌, జైపూర్‌ తదితర ముఖ్య నగరాల్లో బందోబస్తును పటిష్ఠం చేశారు. కీలకమైన ప్రాంతాల్లో అప్పుడే అదనపు దళాలను మోహరించారు.
భ ద్రతా దళాలను, విమానాలను సిద్ధం చేసిన కేంద్రం: అయోధ్య అంశంపై తీర్పు సందర్భంగా దేశంలోని ఏ ప్రాంతంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగినా అక్కడకు సత్వరం భద్రతా దళాలను విమానాలు, హెలికాప్టర్లు ద్వారా తరలించేందుకు వీ లుగా 16 వ్యూహాత్మక ప్రాంతాల్లో కేంద్రం భద్రతా దళాల ను మోహరించింది. అన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ మరింత 'ఎలర్ట్‌'ఆ ఉండాలని కోరింది. హోమ్‌ మంత్రి చిదంబరం దేశంలోని భద్రతా వాతావరణాన్ని సమీక్షించి అయోధ్య కేసులో తీర్పు అనంతరం శాంతిని కాపాడాలని అన్ని వర్గాల వారికి పిలుపునిచ్చారు. ఆయన తమ శాఖకు చెందిన కంట్రోల్‌ రూమ్‌ను, ఇంటిగ్రేటెడ్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ను సందర్శించి వాటి పనితీరును సమీక్షించారు. దేశ వ్యాప్త్తంగా ఉద్రిక్తతలు, తీవ్రమైన ప్రతిస్పందన వ్యక్తం కాగల 32 ప్రాంతాలను హోమ్‌ మంత్రిత్వ శాఖ గుర్తించింది. వాటిలో 4 ప్రాంతాలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. ఆ రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని కోరింది.

0 comments:

Post a Comment

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Dcreators